V6 News

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు

నెట్​వర్క్, వెలుగు :   ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన సమ్మెతో ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ, మెదక్​ జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బుధవారం తెల్లవారుజాము నుంచే కార్మికులు డిపోల వద్ద బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకోవడంతో, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, నల్గొండ, సూర్యాపేట, మెదక్​, సిద్దిపేట, సంగారెడ్డి లాంటి  ప్రధాన కేంద్రాల్లో బస్టాండ్లు వెలవెలబోయాయి.  

సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్, హుస్నాబాద్ డిపోల్లో అధికారులు బస్సులను బయటకు పంపడంతో టైర్లలో గాలి తీసి రోడ్లపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలు డిపోల వద్ద మహిళ కార్మికులు బతుకమ్మ ఆటలు ఆడుతూ డిమాండ్లను ప్రస్తావించారు.

ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ డ్రైవర్లు, పోలీసుల సాయంతో కొన్ని అద్దె బస్సులను నడిపించే ప్రయత్నం చేసినప్పటికీ, కార్మికులు వాటిని అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట లాంటి చోట్ల కండక్టర్లు లేక ప్రయాణికులను ఉచితంగానే తరలించగా, మరికొన్ని చోట్ల ప్రైవేట్ వాహనదారులు అదును చూసి రెట్టింపు చార్జీలు వసూలు చేశారు.

కలెక్టర్లు డిపోలను సందర్శించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ, బస్సులు లేక సామాన్య ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు వెనకడుగు వేసేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.